
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ అక్షాన్ష్ యాదవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, భువనగిరి డివిజన్ డీఎస్పీ శ్రీ బి. రవీందర్ గారి పర్యవేక్షణలో బీబీనగర్ పోలీసులు చైన్ స్నాచింగ్ కేసును విజయవంతంగా ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
బీబీనగర్ పోలీస్ స్టేషన్ క్రైం నెం. 241/2026, సెక్షన్ 304(2) బీఎన్ఎస్ కేసు వివరాల ప్రకారం, 2026 జూలై 12న బీబీనగర్‌కు చెందిన శ్రీమతి కుక్కడువు అందాలు (65) తన భర్తతో కలిసి ఇంటి వద్ద ఉండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమను ప్రభుత్వ ప్రతినిధులుగా పరిచయం చేసుకుని, “ప్రభుత్వం అందించే ఉచిత బియ్యం పథకానికి సంబంధించిన ఫోటోను అప్లోడ్ చేయాల్సి ఉంది” అంటూ నమ్మించారు.
ఫోటో తీసేందుకు మెడలో ఉన్న బంగారు మంగళసూత్రాన్ని తొలగించాలని చెప్పడంతో బాధితురాలు దానిని తీసి తన భర్తకు ఇచ్చింది. అదే సమయంలో నిందితులు బాధితురాలిని తోసివేసి, ఆమె భర్త చేతిలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు మంగళసూత్రాన్ని అపహరించి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బీబీనగర్ పోలీసులు, విశ్వసనీయ సమాచారం మేరకు 2026 జూలై 26న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించారు.
అరెస్టైన నిందితులు:
- సింహాద్రి గంగాధరప్ప (22), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సత్యసాయి జిల్లా.
- జంగాల శివరాజ్ (38), కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్లాపూర్ జిల్లా.
నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నవి:
- 💎 30 గ్రాముల బంగారు మంగళసూత్రం
- 🏍️ ఎన్ఎస్–200 పల్సర్ మోటార్ సైకిల్
- 📱 ఐఫోన్ మొబైల్ ఫోన్
నిందితుల మోసం చేసే విధానం:
నిందితులు ప్రధానంగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వ ఉచిత బియ్యం, పెన్షన్, కేవైసీ లేదా ఇతర సంక్షేమ పథకాల పేరుతో నమ్మకం కల్పించి, ఫోటో తీసేందుకు బంగారు గొలుసు లేదా మంగళసూత్రం తీసేయాలని చెప్పి, ఆభరణాలను అపహరించి పరారయ్యేవారని దర్యాప్తులో వెల్లడైంది.
అలాగే, నిందితులపై ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి, పెనుకొండ, గోరంట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు.
ఈ కేసును ఛేదించడంలో బీబీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎం. ప్రభాకర్ రెడ్డి, ఎస్ఐ శ్రీ ఎన్. రమేష్, హెడ్ కానిస్టేబుల్ బి. అంజయ్య, పోలీస్ కానిస్టేబుళ్లు పి. శ్రీనివాస్, జి. జనార్ధన్, అలాగే భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కొండారెడ్డి, రమేష్ విశేష కృషి చేశారు.
ప్రజలకు సూచనలు:
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ప్రభుత్వ పథకాల పేరుతో ఇంటికి వచ్చే గుర్తు తెలియని వ్యక్తులను నమ్మవద్దు. బంగారు ఆభరణాలను ఎవరికీ అప్పగించవద్దు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్–100కు సమాచారం అందించాలని సూచించారు
PRO
YADADRI BHUVANAGIRI
