IND News

ప్రభుత్వ ఆసుపత్రిలో పై ప్రజల్లో నమ్మకం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

గురువారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. రోగుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వారికి అందిస్తున్న చికిత్స, వైద్య సేవలు, మందుల పంపిణీ తదితర వివరాలను ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.

ఈ నెలలో ఎన్ని ప్రసవ అంచనా తేదీలు (EDD) ఉన్నాయని, ఇప్పటివరకు ఎన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగాయనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లడానికి గల కారణాలను తెలుసుకుని, వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా అవగాహన కల్పించాలని సూచించారు.

క్రిటికల్ డెలివరీల సంఖ్య, ఆయా గర్భిణీలకు అందిస్తున్న చికిత్స, తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్ ఆరా తీశారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి ప్రత్యేకంగాపర్యవేక్షించాలని, హైరిస్క్ ANCలను రిఫరల్ SOP ప్రకారం ఉన్నత స్థాయి ఆసుపత్రులకు సకాలంలో రిఫర్ చేయాలని ఆదేశించారు. ప్రతి గర్భిణీని ప్రసవ సమయానికి ముందుగానే తగిన ఆరోగ్య కేంద్రానికి ట్యాగ్ చేసి, ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

ఈ తనిఖీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్, సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top